వాణిశ్రీ ఇండస్ట్రీలోకి కామెడీ క్యారెక్టర్లతో అడుగుపెట్టారు. హాస్యనటులు పద్మనాభం, రాజనాల వంటి వారి సరసన నటించారు. ఆమె అసలు పేరు రత్నకుమారి. మొదట ఆ పేరుతోటే నటించారు. 1962లో ఓ వైపు 'సోమవార వ్రత మహాత్మ్యం' షూటింగ్ జరుగుతూ ఉండగా, ఆ చిత్ర కథానాయకుడు కాంతారావు, విలన్ పాత్రల స్పెషలిస్ట్ రాజనాల కలిసి 'అలెగ్జాండర్' నాటకం ప్రదర్శించాలని సంకల్పించారు. అందులో నటించడానికి రత్నకుమారి (వాణిశ్రీ)కి మేకప్ వేయించి సెట్స్‌కు తీసుకువెళ్లారు.
'సోమవార వ్రత మహాత్మ్యం' చిత్ర దర్శకుడు ఆర్.ఎం. కృష్ణస్వామి సహకారంతో మూవీ కెమెరాతో కొన్ని భంగిమలు చిత్రీకరించి, ఆ తర్వాత స్టిల్ ఫొటోగ్రాఫర్ నాగరాజారావు చేత కొన్ని స్టిల్స్ తీయించారు. వాణిశ్రీని చూడగానే కృష్ణస్వామి, నాగరాజారావు ఇద్దరూ "ఈ అమ్మాయి సినిమాలకు పనికిరాదు." అని తేల్చేశారు. ఆ తర్వాత కొద్ది కాలానికే 'రణభేరి' సినిమాలో కాంతారావు సరసన హీరోయిన్‌గా వాణిశ్రీని, కీలకమైన వ్యాంప్ క్యారెక్టర్‌కు రాజశ్రీని తీసుకున్నారు నిర్మాతలు. వ్యాంప్ క్యారెక్టర్ రాణిస్తేనే సినిమా రాణిస్తుంది. అందుకని నిర్మాతలతో చెప్పి రాజశ్రీని హీరోయిన్‌గా చేసి, వాణిశ్రీకి వ్యాంప్ క్యారెక్టర్ ఇప్పించారు కాంతారావు. అప్పుడందరూ ఆయన మీద అభాండాలు వేశారు. చిత్రం విడుదలయ్యాక ఆయన జడ్జిమెంట్ కరెక్టని ఒప్పుకున్నారు.
ఆ తర్వాత 'ఆకాశరామన్న' సినిమాలోనూ వ్యాంప్ క్యారెక్టర్ పోషించారు వాణిశ్రీ. ఎప్పుడూ వ్యాంప్ పాత్రలేనా?.. అని ఆమె బాధపడేవారు. "వ్యాంప్ పాత్రల్లో కూడా నీకు నువ్వే సాటి. మనం హీరో హీరోయిన్లుగా కలుసుకొనే రోజు త్వరలోనే వస్తుంది." అని కాంతారావు ఆమెకు సర్దిచెప్పేవారు. ఆయన చెప్పినట్లే, 'దేవుని గెలిచిన మానవుడు' (1967) చిత్రంలో ఆయన సరసన కథానాయికగా చేశారు వాణిశ్రీ. ఆ వెంటనే కృష్ణతో 'మరపురాని కథ'లో హీరోయిన్‌గా చేశారు.
ఆ తర్వాత జరిగింది చరిత్ర. స్టార్ హీరోలందరూ ఆమెనే తమ సరసన నాయికగా కావాలని కోరుకొనే రేంజ్‌లో ఎదిగారు వాణిశ్రీ. మహానటి సావిత్రి తర్వాత తరంలో నంబర్ వన్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్నారు. అంతేకాదు, అప్పట్లో ఆమె స్టైల్ ఐకాన్‌గా మారారు. వాణిశ్రీ కొప్పు, వాణిశ్రీ చీరలు, వాణిశ్రీ బొట్టు అంటూ ఆమె కట్టు బొట్టూ ఫేమస్ అయ్యాయంటే.. అది ఆమె పడిన కష్టానికి ఫలితం.